ముఖ్యమంత్రే మూలవిరాట్టు!ఈనాడు పెన్ కౌ౦టర్



తనవారి కంట్లో ఉన్న దూలాలు బయట పడ్డప్పుడల్లా ఎదుటివారి కంట్లో లేని నలుసుల్ని ఎత్తి చూపడం- ఫ్యాక్షనిజం పొత్తిళ్లలో పుట్టి పెరుగుతున్న సాక్షి లక్షణం. రాజా అక్రమార్క దుష్పరిపాలనకు అక్షరాలా దడి కట్టడం, ప్రజల పక్షాన అవినీతి తిమింగలాలపై పోరాడుతున్న తస్మదీయుల మీద దాడికి సమకట్టడం- దాని జీవన విధానం. అవినీతిలో పుట్టిన పురుగు కదా, ఆ అవినీతే దానికి ఆహారం!

దేశ ప్రతిష్ఠనే మసక బార్చిన 'సత్యం' వ్యవహారంలో తీగ లాగేకొద్దీ కొత్త డొంకలు కదులుతున్నాయి. లక్షలమంది వాటాదార్లను వేలకోట్ల రూపాయలకు ముంచిన ఈ కుంభకోణం తల్లివేరు 'భూమి'లోనే ఉందన్న నిజం వెల్లడైంది. సూర్యుడి చుట్టూ భూమి, భూ గ్రహం చూట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాయంటోంది ఖగోళశాస్త్రం. రాష్ట్రంలో మాత్రం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది అధికారపార్టీ రాజకీయం. రాష్ట్రవ్యాప్తంగా భూములకు కృత్రిమంగా గిరాకీ పెంచి ధరలకు రెక్కలు తొడిగింది వై.ఎస్.ప్రభుత్వమే. పేదవాడికి గజం జాగా లేకపోతేనేం- అయినవాళ్లకు వేల ఎకరాలు దోచిపెట్టేందుకు అడ్డగోలు సంతర్పణలు చేస్తున్నదీ ఈ సర్కారే. దోచుకొన్న వాళ్లకు దొచుకొన్నంతగా అన్నట్లు అనుకూల పరిస్థితులు ఉండటంతో సత్యం రామలింగరాజూ 'భూ మార్గం' పట్టారు. వై.ఎస్.సైతం అవ్యాజ ప్రేమాభిమానాలతో విలువైన భూముల్ని అప్పనంగా దోచిపెట్టారు. ఈ దొంగల దోపిడీని సాక్ష్యాధార సహితంగా వెలుగులోకి తెస్తున్నాయి 'ఈనాడు-ఈటీవీ'. అదే ఏలినవారికి, వారే సృష్టించిన సాక్షికీ కంటగింపైంది. అందుకే 'రెండాకులు ఎక్కువే'నంటూ అవాకులూ చెవాకులూ పేలింది.

తన రంకు బయటపడ్డప్పుడల్లా ఎదిరిపక్షం పాతివ్రత్యాన్ని ప్రశ్నించడం రాష్ట్రంలో వై.ఎస్. ప్రవేశపెట్టిన రాజకీయం. సాక్షి రాతల్లోనూ అదే లక్షణం పొడగడుతోంది ఎందుకంటే- అబ్బ అక్రమంగా తవ్విపోసిన డబ్బుతో పుట్టుకొచ్చిన పత్రిక కదా- ఆ ఉలుకూ పలుకులో ఫ్యాక్షనిజం పోలికలూ చాలికలూ సహజం.

2006 చివర్లో రాష్ట్రంలో రెండుసార్లు 'భూకంపం' వచ్చింది. ఆ సంవత్సరం అక్టోబరు చివరివారంలో ఆకుల రాజయ్య భూ బాగోతం రాష్ట్రాన్ని కుదిపేసింది. డిసెంబరు నాటికల్లా వై.ఎస్. భూదానోద్యమ నాటకం చట్టసభల్ని అట్టుడికించింది. ఇప్పుడు రామలింగరాజు భూముల వ్యవహారం దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతా ఆ తాను ముక్కలే! ఏ విధంగా చూసినా సహేతుక సమాధానాలివ్వలేక ముఖ్యమంత్రి గుక్క తిప్పుకోలేని పరిస్థితి! కాబట్టే వై.ఎస్.కు రక్షణగా సాక్షి రంగంలోకి దిగింది. న్యాయ పోరాటం సాగుతున్న 'లిటిగేషన్'పై సొంత పైత్యం రంగరించి వార్తా కథనం పేరిట విషం చిమ్మింది! రామోజీపై దాడి చెయ్యడం ద్వారా విషయాన్ని పక్కదారి పట్టించాలన్నది వాళ్ల తాపత్రయం. లోగుట్టును జనం పసిగట్టలేరనుకోవడం వాళ్ల అవివేకం.

గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసి తరవాత కాంగ్రెస్ టిక్కెట్‌కోసం ప్రయత్నించిన ఆకుల రాజయ్య ఎలా భూబకాసుర అవతారం ఎత్తిందీ 2006లోనే 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో అమాయక పౌరుల భూముల్ని బలవంతంగా గుంజుకొని ఒక్కఏడాదిలోనే పద్నాలుగు వేల ఎకరాలు 'కొనుగోలు' చేసిన రాజయ్య- అతిపెద్ద భూకుంభకోణంలో పాత్రధారి. అతగాడికి ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే అండదండలున్నాయనీ, ఓ కేంద్ర సహాయమంత్రి డబ్బులిచ్చి మరీ సహకరించారనీ అప్పట్లో వెలువడినవి ఊహాగానాలు కానేకావు. దాన్నిబట్టి తెరచాటు సూత్రధారులు మరెందరో ఉన్నారన్నది నిజం. ఈ భూబాగోతంపై ముఖ్యమంత్రి అప్పుడే విచారణకు ఆదేశించారు. అది ఏమైంది? దర్యాప్తును అర్ధాంతరంగా అటకెక్కించిన అదృశ్యహస్తాలు ఎవరివి? ఆకుల రాజయ్య కొన్న భూములు ఇప్పుడు సత్యం రామలింగరాజు నెలకొల్పిన బోగస్ సంస్థల పాలబడ్డాయంటున్నారే! నిజాయతీగా దర్యాప్తు జరిపితే ఆ సత్యాలు అప్పుడే వెలుగుచూసేవి కావా? వాటికి సమాధానం చెప్పాల్సింది వేరెవరో కాదు- ముఖ్యమంత్రే! జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జి.పి.ఎ.) ద్వారా భూములు కొన్నా ల్యాండ్ సీలింగ్ చట్టాలు వర్తిస్తాయని అధికారులు చెప్పినప్పుడు విచారణను మూసేసి, ఆకుల రాజయ్య ఆచూకీ కనిపెట్టకుండా ప్రభుత్వం వెలగబెట్టిన నిర్వాకం- మరో భారీ కుంభకోణానికి అంటు కట్టిందన్నది సత్యం.

సత్యం భూముల వ్యవహారమే చూద్దాం. వ్యవసాయ భూపరిమితి చట్టం ప్రకారం సంస్థ, వ్యక్తుల పేర ఉన్న భూముల సమాచారం తెలపాలంటూ సత్యం కంప్యూటర్స్‌కు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం 2006 డిసెంబరులోనే నోటీసులిచ్చింది. అస్మదీయ సంస్థ కాబట్టి ఆ నోటీసుల వ్యవహారం నామమాత్రమై పోయింది. అప్పుడే సరైన దర్యాప్తు జరిపి ఉంటే తెరచాటు గూడుపుఠాణీ బయటపడేది కాదా? తాను నేరం చేసినట్లు రామలింగరాజే స్వయంగా అంగీకరించినా సత్యం 'మంచి సంస్థ' అంటూ ముఖ్యమంత్రి దాన్ని వెనకేసుకురావడం లేదా? సత్యం సెజ్ కోసమంటూ వైజాగ్‌లో 200కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమిని వై.ఎస్. కేవలం అయిదు కోట్లకు కట్టబెట్టారు. ఎకరానికి కనీసం రూ.80లక్షలైనా ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ సూచిస్తే, పది లక్షలుగా దాన్ని తెగ్గోసింది ముఖ్యమంత్రే! ఇంత జరిగాక కూడా ఆ భూముల్ని వెనక్కి తీసుకొనేది లేదని వై.ఎస్. భీష్మిస్తున్నారు. ఇంతగా బరితెగించి నేరగాళ్లకు కొమ్ము కాస్తున్న ముఖ్యమంత్రి ఇంకెవరున్నారు?

సమకాలీన రాజకీయాల్లో వై.ఎస్. తరగని అవినీతి గని. ధన బలానికి ముఠా రాజకీయాన్ని జోడించి పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రం వ్యాప్తం చేసిన ఆయన ఏలుబడి తాలూకు దుష్ఫలితాలు- కుంభకోణాల రూపేణా వెలుగుచూస్తున్నాయి. అసలు భూకుంభకోణాలకు కేంద్రబిందువు వై.ఎస్సే. అపర వినోబాలా పోజుకొడుతూ చట్టసభనే తప్పుదోవ పట్టించింది ఆయనే. మిగులు భూముల పాపాన్ని చనిపోయిన తండ్రి ఖాతాలో వేసేసి చేతులు దులుపుకొన్న పెద్దమనిషే, అధికారం చేపట్టాక కూడా కొత్త కొనుగోళ్లు సాగించారని 'ఈనాడు' పరిశోధన ఎలుగెత్తి చాటింది. తన ఆధీనంలో దశాబ్దాలుగా ఉన్న 618 ఎకరాల మిగులు భూముల్ని ప్రభుత్వపరం చేస్తున్నట్లు ప్రకటించి ఇరవై నాలుగ్గంటలు తిరక్కముందే దాన్ని సగానికి తెగ్గోసిన నేరం ఎవరిది? అస్మదీయులకు ప్రాజెక్టుల పేరిట అప్పనంగా భూములు కట్టబెడుతూ సొంత లాభం సాంతం చూసుకొంటున్నదెవరు? తన సొంత ఎస్టేటు ఇడుపులపాయ భూముల మార్కెట్ రేటు పెంచుకోవడానికి రైల్వే లైను సహా, భారీ పథకాల్ని ఆ చుట్టుపక్కలకు తరలిస్తున్న నికృష్ట రాజకీయం ఎవరిది? నానావిధ ఆర్థిక నేరగాళ్లతో మిలాఖత్ అయ్యి, తన ఆస్తులు పెంచుకొంటున్న ముఖ్యమంత్రికి ఎవర్నైనా వేలెత్తి చూపే నైతికహక్కు ఎక్కడిది? ఆ పని సాక్షిచేత చేయిస్తున్నా- అది కూడా వై.ఎస్. అక్రమ సంతానమేగా?

దళారీ రాజయ్య మోసగాడు. తానే పెంచిన సంస్థను ముంచి సొంతలాభం కోసం వాటాదార్లను వంచించిన రామలింగరాజు నేరగాడు. వాళ్లకంటే ఘనుడు వై.ఎస్. మహాశయుడు. రాష్ట్రంలో భూ కుంభకోణాలన్నింటికీ ముఖ్యమంత్రే మూలవిరాట్టు! 2004 ఎన్నికల నాటికి ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్న వై.ఎస్, ఆయన పుత్రరత్నం నాలుగున్నరేళ్లలో వేలకోట్లు ఎలా పోగేశారు? వందలు, వేల కోట్ల రూపాయల ఖర్చుతో భారీ కర్మాగారాలు స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు? ఎవరి బతుకులు ఏమిటన్నది బహిరంగ రహస్యం. ఆస్తులపై పారదర్శక విచారణకు మేము సిద్ధం. ముఖ్యమంత్రి వై.ఎస్, ఆయన కుటుంబీకులు, బినామీలు, తైనాతీల ఆస్తులపైనా న్యాయబద్ధ విచారణ జరిపితే- రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లుగా నిలువునా లూఠీ చేస్తున్న ముఠాలేమిటన్న, వాటి నేతలెవరన్న వాస్తవాలు బయటకొస్తాయి. అందుకు వై.ఎస్. సిద్ధమేనా?

1 comments:

Anonymous said...

22222222222222222222222