;;;;;;;;;;;; Sakshi ;;;;;;;;;;;;;;;;;;;
350 - 25 = 275?
వంటగ్యాస్‌పై కాకిలెక్క
''350 నుంచి 25 తీసేస్తే ఎంత? మూడో తరగతి పిల్లాడిని అడిగినా 325 అనే చెబుతాడు! 'ఈనాడు' మాత్రం 275 అని చెబుతోంది. ఎందుకిలా...? ప్రభుత్వాన్ని ఎలాగోలా అప్రతిష్టపాలు చేయడమే ఆ పత్రిక ధ్యేయమా? వార్తా ప్రమాణాలు మచ్చుకైనా లేని ఆ కథనంలోని అక్షరమక్షరం అబద్ధమే...'' అని మండిపడుతున్న పౌరసరఫరాల మంత్రి కాసు కృష్ణారెడ్డి... తన వాదనను 'సాక్షి'తో ఇలా వినిపించారు!

గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి 'ఈనాడు' శుక్రవారం ప్రచురించిన 'ఆశాభంగం...' కథనంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మండిపడ్డారు. ''గతేడాది జూన్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.300 ఉండేది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలను అనుసరించి ఆ ధరను రూ.50లు పెంచేసింది. అంటే ఒక సిలిండర్‌కు రూ.350 చొప్పున చమురు సంస్థలు వసూలు చేసుకోవలసి ఉంది. కానీ మన రాష్ట్రంలోని లక్షలాది దీపం కనెక్షన్లతోపాటు పేద, మధ్యతరగతి వినియోగదారులపై ఇంత భారం మోపడం సమర్థనీయం కాదని భావించిన ముఖ్యమంత్రి అప్పట్లోనే పెరిగిన భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పాత ధరకే అమ్మాలనీ, పెరిగిన ధరను ఖజానా నుంచి చెల్లిస్తామని చమురు సంస్థలకు చెప్పారు. మాట ప్రకారం ప్రతి నెలా దాదాపు రూ.25 కోట్ల దాకా చెల్లిస్తూ వస్తున్నారు. ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ వర్తిస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ప్రతి గ్యాస్ వినియోగదారుడికి తెలుసు. ఈ బుధవారం రాత్రి కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర రూ.25లు తగ్గించింది. అంటే, దేశవ్యాప్తంగా ఒక్కో సిలిండర్‌కు రూ.325 చొప్పున చమురు సంస్థలు వసూలు చేసుకోవాలన్నమాట! అయితే, రాష్ట్రంలో మాత్రం గ్యాస్ సిలిండర్ ధర పెరగదు; తగ్గదు! ఎందుకంటే... ఇక్కడ రూ.300 చొప్పునే చమురు సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఆపైన ఎంత భారం పడినా రాష్ట్రమే భరిస్తోంది కాబట్టి!! కానీ ఈనాడు ఈ నిజాలను నేరుగా చెప్పకుండా ఓ అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. ''ముఖ్యమంత్రి ఆడపడుచులకు ఆశాభంగం కలిగించారు. వారి ఆశలపై వై.ఎస్. నీళ్లు చల్లారు. కేంద్రం సిలిండర్ ధరను 25 రూపాయలు తగ్గించగానే... అందరూ ఇక సిలిండర్ ధర 275కు తగ్గుతుందని భావించారు'' అని ఆ కథనంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ధర 350 రూపాయలుండి, దాన్ని కేంద్రమే రూ.25లు తగ్గించినప్పుడు... రాష్ట్రంలో ధర 275 రూపాయలు ఎలా అవుతుందో 'ఈనాడు'కే తెలియాలి?'' అని మంత్రి పేర్కొన్నారు.

ఆ కథనం ఓ వంచనాశిల్పం!

''ఇన్నాళ్లూ నెలకు రూ.25 కోట్లకు పైగా రాష్ట్రమే భరిస్తుండగా, అది మరుగునపడేలా, ఇప్పుడు కేంద్రం తగ్గించినా, రాష్ట్రం ఆ తగ్గింపును వినియోగదారులకు అందకుండా అడ్డుకుంటోంది అనే భావం వచ్చే రీతిలో ప్రచురించిన ఆ కథనం ఒక వంచనాశిల్పం! ఆ పాతిక రూపాయలూ ఖజానాలో వేసుకోవాలని నిర్ణయించారని మరో వాక్యం పొందుపరిచారు. కానీ ఇప్పటికీ రాష్ట్రం సిలిండర్‌పై రూ.25 భరించాల్సి వస్తోందనీ, ఇలా నెలకు రూ.13 కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందనీ విస్మరిస్తే ఎలా? ఇప్పటికి దాదాపు రూ.200 కోట్లను ప్రభుత్వం భరించింది. ఐనా 'ఈనాడు'లో ఇవేం లెక్కలు? ధర తగ్గించడం లేదంటూ హైదరాబాద్, విజయవాడల్లో సిలిండర్లు సరఫరా చేసే సిబ్బందిపై దాడులు జరిగాయనీ రాశారు. కానీ ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అధికారులకు సమాచారమే లేదు. కేంద్రం ప్రకటించిన విధంగా తగ్గించిన ధరకు రాష్ట్రంలో సిలిండర్లు విక్రయించవద్దని చమురు సంస్థలకు గురువారం ప్రభుత్వం ఆదేశించిందనీ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదీ అబద్ధమే. ఎందుకంటే... ఒకవైపు కేంద్ర ప్రభుత్వ తాజా ధర రూ.325కన్నా తక్కువకే మన రాష్ట్రంలో అమ్ముతుండగా, తగ్గించిన ధరకు అమ్మవద్దని రాష్ట్రం ఆదేశించడమేమిటో ఆ పత్రికకే తెలియాలి. సర్కారు అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు కూడా! కేంద్రం వరమిచ్చినా రాష్ట్రం మొండిచేయి, అన్ని జిల్లాల్లోనూ మహిళలు మండిపడుతున్నారు. రాజకీయపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి... అంటూ ఏదో ఓ కొత్త ఆందోళనకు తామే శ్రీకారం చుట్టాలనే రీతిలో కథనాన్ని చెక్కారు. కానీ అధిక ధర భారం మహిళలపై పడకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఈ ప్రభుత్వమే సిలిండర్‌కు సబ్సిడీ ఇస్తున్న సంగతి మహిళలకూ తెలుసు. మహిళల ఆగ్రహానికి విరుగుడుగా మసాలా దినుసుల పథకం ఏదో ప్రవేశపెడుతున్నట్లు కూడా ఈనాడు వక్రీకరించింది. కానీ, గ్యాస్ ధరల నిర్ణయానికి కొన్ని రోజుల ముందే మేం మసాలా దినుసుల పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాం. దానికీ దీనికీ లంకె పెట్టడమంటే, మోకాలికీ బట్టతలకూ ముడిపెట్టడం వంటిదే!'' అని మంత్రి విశ్లేషించారు.

--------------- EENADU ------------

సాక్షి కథనం చెల్లని కాసు
చౌక పత్రికగా చెప్పుకొనే సాక్షి తనకు తాను ప్రకటించుకోకపోయినా, విజ్ఞులైన పాఠకులు తేలిగ్గా గ్రహించగల వాస్తవం ఒకటుంది. ప్రజాశ్రేయంకన్నా వై.ఎస్.సర్కారు ప్రయోజనాలే మిన్న అంటూ అది అచ్చొత్తుతున్న చౌకబారు వార్తాకథనాల్ని బట్టి అది ఏ స్థాయి పత్రికో ఎవరికైనా బోధపడుతుంది.

కాలంతో పోటీపడుతూ తన సర్కారు వడివడిగా సాగిస్తున్న దోపిడీలు, దురాగతాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే పత్రికలు, ప్రతిపక్షాలపై వై.ఎస్.సర్కారు యాభయ్యారు నెలలుగా చేస్తున్నది ఒక్కటే- ఎదురుదాడి. వై.ఎస్.కు చేదోడుగా ఆయన పుత్రరత్నం ప్రారంభించిన కరపత్రం ఇప్పుడా పని బహు శ్రద్ధగా చేస్తోంది. వై.ఎస్.సర్కారుపై ఈగైనా వాలనివ్వరాదన్న అజెండాకు అనుగుణంగా అబద్ధాలు, కట్టుకథల కలనేతగా పత్రికలో కాలాల్ని నింపుతోంది. అలవాటుగా 'ఈనాడు'ను తెగనాడే క్రమంలో- అధర్మపీఠంపై ఓ అమాత్యుణ్ని ఎక్కించి అసత్యాల ప్రసంగ ఘోషకు తన వంతు విషం కలిపి పాఠకులకు వడ్డించింది 'సాక్షి'. 'మూడొందల యాభైనుంచి పాతిక తీసేస్తే ఎంత' అంటూ అతి తెలివి ఒలకబోసి రాష్ట్రవ్యాప్తంగా మహిళల విజ్ఞతనే అపహసించేలా రాజకీయ వక్రోక్తులకు ఆ పత్రిక తెగబడింది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి లెక్కల పాండిత్యం ఎంతో సాక్షి వార్తాంశమే కొత్తగా నిగ్గు తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కిరోసిన్ కోటా పెంచాలంటూ కేంద్రానికి విజ్ఞాపన సమర్పించినప్పుడు- 'ఇంతకీ ఇప్పుడిస్తున్నది ఎంత' అని పైవారు ప్రశ్నిస్తే తెల్లమొగమేసినప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అమాత్యుల తెలివి! సూపర్‌ఫైన్ బియ్యం ఇరవై రూపాయలకు మించి అమ్మరాదంటూ తామిచ్చిన ఉత్తర్వుల అమలును తనిఖీ చెయ్యబోయినప్పుడే ఆయన గణాంక పాండిత్యం వీధుల్లో ఊరేగింది. అంతటి మేధావి సాక్షికే తన 'వాదన' వినిపించారట. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట. అలా సాగిన మేజువాణీ- 'వంటగ్యాస్‌పై కాకిలెక్క'గా తేలింది. ఆ కాకిగోలేమిటో చూద్దాం.

పాతికసార్లకుపైగా పెట్రో ధరలు పెంచారంటూ ఎన్.డి.ఎ. పాలనమీద సోనియా, తెదేపాపైన వై.ఎస్. 2004 ఎన్నికలప్పుడు నిప్పులు చెరిగారు. సామాన్యులకు (ఆమ్ ఆద్మీ) అండగా నిలబడేది మేమేనని నమ్మించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ సంకీర్ణం తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం- పెట్రో ధరలు పెంచడం! అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగాయి, చమురు ఉత్పాదక సంస్థలు నష్టాల పాలవుతున్నాయి- ఎప్పుడూ ఇవే సాకులతో ఎనిమిది సార్లు ధరలు పెంచారు. 2008 జూన్ 4న పెట్రోలుపై అయిదు రూపాయలు, డీజిల్‌పై మూడు రూపాయలతో పాటు వంటగ్యాస్ బండపైన ఎకాయెకి రూ.50 వడ్డించారు. 'తప్పనిసరి పరిస్థితుల్లో ధరల దండంతో వినియోగదార్లనీ మేం దెబ్బకొట్టాం. వారికి బాధోపశమనం కలిగించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. మేం ఇప్పటికే ఎంతో భారం భరిస్తున్నాం కాబట్టి, మీ వంతుగా కొంత భారాన్ని పంచుకోవా'లంటూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రధాన రాష్ట్రాలన్నీ తాము విధించే పన్నులు సుంకాల్ని తెగ్గోశాయి. హర్యానా, గోవాలాంటివి వంటగ్యాస్‌పై వ్యాట్‌ను పూర్తిగా తొలగించాయి. ఆ విధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ వినియోగదారులకు బహుముఖ తోడ్పాటు అందించాయి. రాష్ట్రంలో నడిచేది దేవుడి పాలన కదా? దేశంలోనే అత్యధికంగా ఉన్న పెట్రో పన్నుల తగ్గింపు ఊసెత్తకుండా, గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పెంచిన మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వై.ఎస్. ప్రకటించారు. ఆడపడుచులపై తమ సర్కారు అభిమానానికది నిదర్శనమన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు గణనీయంగా పడిపోయాక కూడా కేంద్రం నెలల తరబడి మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు పెట్రో రేట్ల సవరణకు సిద్ధపడింది. పెంచిన వంటగ్యాస్ ధరలో పాతిక రూపాయలు తగ్గించింది. ఆ తగ్గింపును పాతికకే పరిమితం చేసి కేంద్రం, ఆ మాత్రం ప్రయోజనాన్నీ బదలాయించేది లేదంటూ రాష్ట్రప్రభుత్వం ప్రజాశ్రేయాన్ని గాలికొదిలేశాయి. ఈనాడు ప్రశ్నిస్తోంది ఆ జనవంచక రాజకీయాన్ని!

ఏడాది కాలంలో పెట్రో ధరల్ని కేంద్రం రెండుసార్లు పెంచితే రాష్ట్రం అమ్మకం పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచిందని 2002 నవంబరులో వై.ఎస్. విపక్షనేతగా ఊగిపోయారు. డ్వాక్రా మహిళల పేరిట ఉన్న గ్యాస్ సిలిండర్లపై యాభై రూపాయలు ధర తగ్గిస్తామని 2004 ఏప్రిల్‌లో ఎన్నికల వాగ్దానం గుప్పించారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్. పెట్రో ఉత్పత్తులపై అమ్మకం పన్ను తగ్గించారా- లేదు. వాగ్దానం మేరకు డ్వాక్రా మహిళలకు రాయితీ ఇచ్చారా- లేదు! రాష్ట్రంలో పెట్రోలుపై పన్ను 33 శాతం, డీజిల్‌మీద 22.25 శాతం, వంటగ్యాస్‌పై వ్యాట్ నాలుగు శాతం, వాణిజ్యావసరాల సిలిండర్లపై 12 శాతం! గ్యాస్ బండలపై వ్యాట్ రూపేణా రాష్ట్రానికి వస్తున్నదే ఏటా రూ.150 కోట్లు! ఇప్పుడు సాక్షీ భూతుల కాకిలెక్కలు చూద్దాం...

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అనేది రూపాయల్లో లాభనష్టాలు లెక్కించుకొనే చిల్లరకొట్టు కాదు. ప్రజలకు ప్రయోజనం కల్పించడానికే ప్రభుత్వాలున్నప్పుడు, పేరుగొప్ప సర్కార్లనుంచి సహేతుక లబ్ధిని ఆశించడం పౌరుల హక్కేగాని- అది ఏలికల దయాధర్మం కానేకాదు. పెట్రో ధరలపై దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విషవలయం సృష్టించాయి. అహేతుక పన్నుల వ్యవస్థను కొనసాగిస్తూ, అంతర్జాతీయ రేట్ల బూచి చూపించి పెట్రో ధరలు పెంచడం, పెరిగిన ధరలమీదా సుంకాలూ పన్నులూ పిండుకోవడం అలవాటుగా మారింది. మొన్న జూన్‌నాటి పెంపుదల బట్టే చూసినా పెట్రోలు, డీజిళ్లపై పెరిగిన ధరల మేరకే వై.ఎస్.ప్రభుత్వం దండుకోదలచిన పన్నులు రూ.498 కోట్లు. యాభై రూపాయల గ్యాస్ భారాన్ని మొత్తంగా ప్రభుత్వం నెత్తికెత్తుకొన్నా అందుకయ్యే అంచనా వ్యయం ఏడాదికి రూ.312 కోట్లే! ఆ రకంగా చూసినా రూ.186 కోట్లు మిగులే! మొన్న జూన్‌నుంచి డిసెంబరులో తొలి తగ్గింపు వర్తించేదాకా రాష్ట్రంలో అమ్ముడైన ఒక్కో లీటర్ పెట్రోలు మీదా పన్నుల రూపేణా అదనంగా రూ.1.38 పైసలు, అదే డీజిల్‌పై రూ.0.59 పైసల్ని రాష్ట్రప్రభుత్వం ఒడిసిపట్టింది. గ్యాస్‌పై నాలుగుశాతం వ్యాట్ వడ్డనా నిర్విఘ్నంగా కొనసాగింది! పప్పూ ఉప్పూ, నూనెలు, బియ్యం, కూరలవంటి నిత్యావసరాలన్నీ భగ్గుమంటున్నా గ్యాస్ ధర పెరగలేదన్న కొద్దిపాటి సాంత్వననే వై.ఎస్.సర్కారు కలిగించగలిగింది. ఇప్పుడు కేంద్రమే పాతిక రూపాయల రేటు తగ్గించినప్పుడు ప్రజాప్రయోజన కాంక్ష నిజంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఆ లబ్ధిని నేరుగా వినియోగదారులకు బదలాయించాలి. మహిళాలోకమూ అదే ఆశించింది. ఆ ఆశావహ గళాన్ని, పాతిక రూపాయల లబ్ధిని మహిళలకు బదిలీ చేసినా రాష్ట్రప్రభుత్వం పెద్దగా నష్టపోయేదేమీ లేదన్న నిజాన్ని గణాంకాల సాక్షిగా ఈనాడు ప్రచురించింది. ఇందులో కాకిలెక్క ఎక్కడుంది? ఈనాడుపై విషంకక్కడం ద్వారా స్వీయ నిర్వాకాల్ని కప్పిపుచ్చుకోవాలన్న పాలకపక్షీయుల దురాలోచనను అక్షరబద్ధం చేసిన సాక్షి రాతల్లో తప్ప!

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎన్నో మేళ్లు జరుగుతాయని వై.ఎస్. ఊదరగొట్టారు. కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతాశ్రీలు ఉమ్మడిగా మేళ్లు చెయ్యడం లేదు- పన్నులు, సుంకాల తేళ్లతో చెండుకుతింటున్నారు. వంటగ్యాస్ సబ్సిడీ రూపేణా ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లను ప్రభుత్వం భరించిందని అమాత్యుడి ఉద్ఘోష. ఇప్పటికి పెట్రో సుంకాల పేరిట అదనంగా ఎంత పిండారో లెక్క చెప్పలేదేం? ఓ వంక జనం సొమ్మును జలగల్లా పీలుస్తూ వారికి వాస్తవ ప్రయోజనం కలిగించడానికి అంత కిందుమీదులవుతారేం? ఇప్పటికీ సిలిండర్‌పై పాతిక రూపాయలు భరించాల్సి వస్తోందన్న మంత్రి- అదేదో తన జేబులోనుంచో, వై.ఎస్.ఎస్టేట్‌నుంచో తెచ్చిపెడుతున్నట్లు బాధపడతారెందుకు?

'అధిక భారం మహిళలపై పడకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఈ ప్రభుత్వమే సిలిండర్‌కు సబ్సిడీ ఇస్తున్న సంగతి మహిళలకూ తెలుసు'నన్న మంత్రి కృష్ణారెడ్డి మాటా చెల్లని కాసే! హర్యానా సిలిండర్‌పై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చెయ్యగా షీలాదీక్షిత్ ప్రభుత్వం పెరిగిన సిలిండర్ ధరలో 80 శాతం సబ్సిడీగా భరిస్తోంది. ఎక్కడా లేనివిధంగా మహిళలపై వరాల జల్లు తామే కురిపిస్తున్నామన్న బడాయి మాటల బండారం- ఈ సర్కారు కొత్తగా చెబుతున్న లెక్కల్లోనే బట్టబయలవుతోంది. ఖజానాను అస్మదీయులతో నిశ్శేషంగా భాగించి శూన్యహస్తాల్ని జనానికి చూపడమే వై.ఎస్.సర్కారు లెక్క. ప్రజానీకం ఆ లెక్కల్ని సరిచేసేదాకా అలాగే సాగుతుంటుంది అమాత్యుల అసంబద్ధ వాదన!

0 comments: